18, మార్చి 2020, బుధవారం

master e.b.......ఇదిగో..కావలసినంత తీసుకో......సత్సంగము ::9.04

సాయి మాస్టర్ గార్లు సదా మనలను అందరినీ అనుగ్రహించా లని ప్రార్ధిస్తున్నాను..

From : Mannava Satyam
18/3/2020....I Pray to Sai Master to Bless us all with Good Health and success..
(62)....ఇదిగో..కావలసినంత తీసుకో......సత్సంగము ::9.04
https://youtu.be/coOlSmDRKuo
------------

మాస్టర్ ఇ.బి.
              "....'ఒక్కోసారి భలే నవ్వు వచ్చేది. దూరప్రయాణం కదా, బట్టలు మట్టికొట్టుకుపోయేవి. పైగా గడ్డం పెరిగివుండేది. అది రైల్లో ఒక అనుకూలతగా వుండేది. సీట్లలో హాయిగా కూర్చోడానికీ, ఒక్కోసారి పడుకోడానికీ కూడా వీలయ్యేది. అందరూ కొంతదూరంలో కూర్చునేవారు. ఏ జేబుదొంగో అనుకునేవారేమో, అనుమానంగా చూచేవారు. తమ సామాన్లు జాగ్రత్తగా పెట్టుకునేవారు' అని చెప్పసాగారు శ్రీ మాష్టర్.
       ఈ విషయాలు శ్రీ మాష్టర్ ద్వారా వింటుంటే నాకెంతో నవ్వు వచ్చింది. ఇంతలో ఎవరో అబ్బాయి ఒక పెద్ద పూలదండ తీసుకునివచ్చి మాష్టరుగారికి యిచ్చాడు. ఇంట్లో అప్పుడే కట్టి పంపినట్లుగా వుంది. పూలదండ యిచ్చి అతను వెళ్ళిపోయాడు. 
       ఆ పూలమాల చాలా తాజాగా, ఎంతో అందంగా వుంది. రెండు మూడు రకాల పూలు కలిపి కట్టారు. శ్రీ మాష్టర్ ఆ పూలమాల నా చేతికిచ్చి బాబాఫొటోకు వెయ్యమన్నారు. నేను శ్రీ మాష్టర్ చెప్పినట్లు బాబాఫొటోను పూలమాలతో అలంకరించి నమస్కరించుకున్నాను.
       'ఈ పూలమాల ప్రక్కగ్రామం నుంచి గోపాలయ్యగారని, వారు పంపారు. వాళ్ళ పాపకు సాయి అనుగ్రహం కలిగింది' అన్నారు శ్రీ మాష్టర్.
      'ఏం జరిగింది? ఎలా సాయిభక్తులయ్యారు?' అని అడిగాను నేను ఆతృతతో.
     శ్రీ మాష్టర్ చెప్పనారంభించారు - 'విజయకుమార్‌ అని నా విద్యార్థి, కొత్తపాలెం గ్రామం. క్రితంసారి వచ్చినప్పుడు నువ్వు అతన్ని చూచేవుంటావు. అతను సత్సంగానికి వస్తూవుంటాడు. సత్సంగం గురించీ, నా గురించీ వాళ్ళ యింట్లో వాళ్ళకు చెబుతూ వుండేవాడు. ఒకసారి కొత్తపాలెం రమ్మని నన్ను ఆహ్వానించాడు. శ్రీ గోపాలయ్య గారింట్లో సత్సంగం ఏర్పాటుచేశారు. 
       'కొత్తపాలెంలో సత్సంగంలో శ్రీసాయి గురించి చెబుతున్నాను. అందరూ ఎంతో శ్రద్ధతో విన్నారు. కాసేపు భజన చెప్పాను. ఇంతలో వాళ్ళ అమ్మవడిలో కూర్చున్న పాప పారాడుతూ నా దగ్గరకు వచ్చింది. దగ్గరకు తీసుకున్నాను. పాప ఏదో తేడాగా వుంది. అప్పుడు ఆ పాప గురించి వాళ్ళు నాకు అంతా చెప్పారు.
        ఆ పాప పేరు చి|| మల్లి. అప్పటికి 6 సం||లు. నెల్లూరు అమెరికన్ హాస్పటల్‌లో జన్మించింది. 14 వ రోజున యింటికి తీసుకువస్తున్నారు. నెల్లూరులో రైలు ఎక్కుతూ ప్లాట్‌ఫాంమీద నుంచుని రైలులోని మరో ఆమెకు పాపను అందిస్తోంది వాళ్ళ అమ్మగారు. పాపను ఎత్తుకుని రైలు ఎక్కటం కష్టమని, జాగ్రత్త కోసమని అలా చేసిందామె. ఆ జాగ్రత్తే శాపం అయింది. పొత్తిళ్ళలోని పాప జారిపోయింది. పాపను అందించే సమయంలో చేతుల్లోంచి జారి రైలుకూ, ప్లాట్‌ఫాంకూ మధ్యగల సందులోంచి కింద పడిపోయింది పాప. 14 రోజుల పసికందు. తలకు దెబ్బ తగిలింది. గూడూరులో రైలు దిగగానే డాక్టరు దగ్గరకు వెళ్ళారు. ఏదో వైద్యం చేశారాయన. పాప కోలుకుంది. పెరిగి పెద్దదవుతోంది. కానీ మాటలు రాలేదు, నడక రాలేదు. ఇదుగో, అలాగే పారాడుతూ వుంటుంది. ఇదంతా పాప గురించి వారు నాకు చెప్పారు'......"
   పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాష్టర్ గారి జీవితము - బోధలు
రచన : శ్రీ మన్నవ సత్యం

అనుచరులు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి